బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎదురుందా?

-

 

సీఎం కేసీఆర్ కు నమ్మిన బంటు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్దన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, లాంటి సీనియర్ లీడర్లను కాదని కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. దీంతో కేసీఆర్ తో ప్రశాంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి.

బాల్కొండ నియోజకవర్గంలో ప్రస్తుతం బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఈయనకు ప్రత్యర్థులుగా ఉన్న మల్లికార్జున్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. సునీల్ రెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. ఈరవత్రి అనిల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనిల్ 2009లో ప్రజా రాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీకి తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా చేసిన ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేశ్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారే. సురేశ్ రెడ్డి నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఆయన బాల్కొండ నుంచి కాకుండా ఆర్మూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ చేతిలో ఓడిపోయారు. సురేశ్ రెడ్డి ఎంపీ కావడం, బీజేపీకి ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం, కాంగ్రెస్ నుంచి బీసీ సామాజిక వర్గ నేత అనిల్ కు  క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం లేకపోవడం ప్రశాంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. ప్రశాంత్ రెడ్డి కి కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. దీంతో ఆయన గెలుపును అడ్డుకోలేరనే  ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నాటికి ప్రశాంత్ రెడ్డి పై ఇదే పాజిటివ్ టాక్ ఉంటే ఆయన గెలుపు సులభమేనని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version