ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. కొందరు పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. వాటిని చదివితే నిజమైన వార్తేమోనని సందేహం కలగక మానదు. అంతలా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఫేక్ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే ఆ లోగా ఆ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజిస్తారనే ఓ వార్త ప్రచారం అవుతోంది. అందులో భాగంగానే ఆ రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్ ఖండ్ పేరిట మూడు రాష్ట్రాలుగా విభజిస్తారని, ఉత్తర ప్రదేశ్‌కు లక్నో రాజధానిగా ఉంటుందని, పూర్వాంచల్‌కు గోరఖ్‌పూర్, బుందేల్‌ఖండ్‌కు ప్రయాగ్ రాజ్ రాజధానులుగా ఉంటాయని ఆ వార్తలో ఉంది.
एक खबर में दावा किया गया है कि केंद्र सरकार उत्तर प्रदेश को 2-3 हिस्सों में विभाजित करने और पूर्वांचल को अलग राज्य बनाने पर विचार कर रही है।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। केंद्र सरकार, उत्तर प्रदेश के अलग हिस्से करने से संबंधित कोई विचार नहीं कर रही है। pic.twitter.com/tKnKKrHJRA
— PIB Fact Check (@PIBFactCheck) June 12, 2021
అలాగే పూర్వాంచల్‌లో 23 జిల్లాలను, బుందేల్ ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో 17, 20 జిల్లాల చొప్పున ఏర్పాటు చేస్తారని కూడా ఆ మెసేజ్‌లో ఉంది. అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని, ఉత్తరప్రదేశ్‌ను విభజించే ఆలోచన లేదని సీఎం యోగి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది.
అయితే 2011లో అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం, బీఎస్‌పీ అధినేత మాయావతి ఆ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అనుకున్నారు. పూర్వాంచల్, బుందేల్ ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ్ ప్రదేశ్‌లుగా విభజిద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ వీలు కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వార్త వైరల్ కావడం విశేషం. అయితే వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని, కానీ విభజిస్తే బీజేపీకి పరిస్థితులు అనుకూలిస్తాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే కొందరు ఈ వార్తను వైరల్ చేసి ఉంటారని తెలుస్తోంది.