భారీగా చెలామ‌ణీ అవుతున్న న‌కిలీ రూ.500 నోట్లు.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

-

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2016వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల‌లో రూ.500, రూ.1000 పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదితమే. దీంతో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ క‌లిగిన ఆ నోట్లు రాత్రికి రాత్రే చెల్ల‌కుండా పోయాయి. త‌మ వ‌ద్ద ఉన్న ఆ నోట్ల‌ను మార్చుకునేందుకు జ‌నాలు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. అవినీతిని అరిక‌ట్టేందుకు, న‌ల్ల ధ‌నాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు, న‌కిలీ క‌రెన్సీని అడ్డుకునేందుకు నోట్ల‌ను ర‌ద్దు చేశామని త‌రువాత కేంద్రం స‌మ‌ర్థించుకుంది. కానీ కేంద్రం చెప్పిన ఆ ల‌క్ష్యాలు ఏవీ నెర‌వేర‌లేదు.

అప్ప‌ట్లోనే బ‌డాబాబులు పెద్ద ఎత్తున న‌ల్ల‌ధనాన్ని సుల‌భంగా మార్చుకున్నారు. కొంద‌రు బ్యాంకు అధికారులు, సిబ్బందితో లాలూచీ ప‌డి వారు త‌మ వ‌ద్ద ఉన్న పెద్ద నోట్ల‌ను మార్చుకున్నారు. ఇక అప్ప‌ట్లో ప్ర‌వేశ‌పెట్టిన రూ.500 కొత్త నోట్లను ఎవ‌రూ కాపీ చేయ‌లేర‌ని, వాటికి న‌కిలీల‌ను సృష్టించ‌డం అసాధ్యం అని కేంద్రం చెప్పింది. కానీ తీరా చూస్తే ప్ర‌స్తుతం ఆ నోట్లకు గాను భారీగా న‌కిలీ నోట్లు చెలామ‌ణీలో ఉన్న‌ట్లు తేలింది. దీన్ని బ‌ట్టి చూస్తే కేంద్రం చెప్పిన ల‌క్ష్యాలు ఏవీ నెర‌వేర‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ఇక కొత్త రూ.500 నోట్ల‌కు గాను న‌కిలీ నోట్లు బాగా వ‌స్తున్నాయ‌ని, 2020-21 మ‌ధ్య స‌మ‌యంలో చెలామ‌ణీలో ఉన్న న‌కిలీ రూ.500 నోట్ల సంఖ్య 31.3 శాతానికి పెరిగింద‌ని తేలింది. ఏటా కొత్త రూ.500 కు గాను న‌కిలీ నోట్ల సంఖ్య బాగా పెరుగుతుంద‌ని నిర్దారించారు. ప్ర‌స్తుతం ఆర్‌బీఐ రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది. కానీ 2019 నుంచి రూ.2000 నోట్ల‌ను ముద్రించ‌డం ఆపేశారు. ఇక ఈ ఏడాది నుంచి రూ.2000 నోట్ల స‌ర‌ఫ‌రాను కూడా నిలిపివేశారు.

కేంద్రం న‌కిలీ క‌రెన్సీని నివారించేందుకు కొత్త నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని చెప్పినా ప్ర‌స్తుతం న‌కిలీ నోట్లు మాత్రం ఎక్కువ‌గానే చెలామ‌ణీ అవుతున్నాయి. క‌నుక క‌రెన్సీ నోట్ల‌ను తీసుకునేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version