చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం పబ్‌జి సహా అనేక యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అయితే పబ్‌జి గేమ్‌ను ఇండియన్ వెర్షన్‌లోకి మార్చి మళ్లీ పబ్‌జి కార్ప్ ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నించింది. కానీ పబ్‌జి మొబైల్ ఇండియన్ వెర్షన్‌కు ఇంకా అనుమతి లభించలేదు. ఇక పబ్‌జి బ్యాన్ అయిన అనంతరం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫౌ-జి గేమ్‌ను ప్రకటించారు. నిజానికి ఈ గేమ్ ఈపాటికే లాంచ్ కావల్సి ఉంది. కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్టకేలకు మంగళవారం ఈ గేమ్ గేమింగ్ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫౌ-జి గేమ్ లాంచ్ అయింది. ఈ గేమ్‌ను ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆండ్రాయిడ్ 8.0 ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ గేమ్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ గేమ్‌ను లాంచ్ చేయనున్నారు.
ఇప్పటికే ఫౌ-జి గేమ్‌కు చెందిన టీజర్, ట్రైలర్లు గేమింగ్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ముందుగా గాల్వన్ లోయ నేపథ్యంలో యూజర్లు గేమ్ ఆడవచ్చు. తరువాత పబ్‌జి తరహాలో బ్యాటిల్ రాయల్ మోడ్‌ను అందుబాటులోకి తెస్తారు. అయితే ఫౌ-జి గేమ్ ఇండియన్ గేమింగ్ ప్రియులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.