రైల్వే టికెట్ల కోసం ఎక్కువమంది ఆశ్రయించే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, యాప్ తాత్కాలికంగా పనిచేయడంలేదు. సాంకేతిక సమస్యల కారణంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అమేజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈమేరకు మంగళవారం ఉదయం ఐఆర్ సీటీసీ ట్వీట్ చేసింది.
సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. ఐఆర్‌సీటీసీ వెబ్ పోర్టల్, యాప్‌లోని సేవలు ఉదయం 8 గంటల నుండి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఐఆర్ సీటీసీలో ఏర్పడిన సమస్యను త్వరగా సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.