కొన్నిసార్లు అయినా జాతీయ పార్టీ అయిన బీజేపీని నమ్మవచ్చు కానీ ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిని మాత్రం నమ్మలేం..అని కొన్నిసార్లు అనుకోవడం మన వంతు కావాలి. ఎవరినో ఒకరిని నమ్ముకున్నాకే రాజకీయం ఫలిస్తుంది అని కూడా అనుకోవాలి. ఆ విధంగా కేసీఆర్ ను నిన్నటి వేళ నమ్మి ఆయనకు నిజంగానే జ్వరం వచ్చిందని అందుకే తన రాజ గురువు ఆశ్రమానికి వెళ్లలేకపోయారని కూడా అనుకోవాలి.మరోవైపు మోడీ వచ్చినా ఎందుకు వెళ్లలేదు అంటే అందుకు కారణం ఆయనను తిట్టిన నోరుతోనే ఎలా వెల్కం చెబుతాను అని అనుకొని ఆగిపోయారు. ఇదంతా బడ్జెట్ కారణంగా జరిగింది. అంటే నిర్మలత్త చేసిన పని ఇది! లేదంటే కేసీఆర్ మాత్రం బీజేపీ ప్రేమలోనూ మరియు మోడీ ప్రేమలోనూ తప్పక ఉండేవారు.
కేసీఆర్ కు జ్వరం వచ్చింది. ఆ కారణంగా పాపం ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు నిన్నటివేళ.తనకు అత్యంత ఆప్తుడు అయిన ప్రధాని మోడీ వచ్చినా కూడా వెళ్లకుండా ఇంటికే పరిమితం అయిపోయారు.శంషాబాద్ సమీపాన స్వామీజీ ఆశ్రమానికి వెళ్లకుండా, అక్కడ రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణకు మరియు ఇతర వైదిక కార్యక్రమాలకు వెళ్లకుండా, స్వామీజీ ని దర్శించుకోకుండా ఇంటికే పరిమితం అయిపోయారు.దీంతో ఆయనపై చాలా మంది కోపం అవుతున్నారు. బీజేపీ నోటికి వచ్చిన విధంగా తిడుతోంది. ఇంటికి వచ్చిన అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ నానా హైరానా పడుతోంది. పాపం లౌక్యం తెలియని బండి సంజయ్ అయితే మరీ ఘోరంగా తిడుతున్నారు. కేవలం రాజకీయంలో భాగంగానే ఆయన అక్కడకు వెళ్లలేదు అని సంజయ్ కు తెలియదా? తెలుసు కానీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ సారథ్య బాధ్యతలు చూస్తున్న వ్యక్తి హోదాలో పాపం సంజయ్ కాస్త ఎక్కువ కోపం అయ్యారు.అది కూడా తప్పేనా!