కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనాలను రహదారులపైకి రావద్దని, అత్యవసరం అయితే తప్ప బయట తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రూల్స్‌ను అతిక్రమించే వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం.. సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అసలు సెక్షన్ 188 అంటే ఏమిటి..? దీని కింద ఎలాంటి శిక్షలు ఉంటాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ పీనల్ కోడ్‌లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) 1973 మొదటి షెడ్యూల్‌లో సెక్షన్ 188 గురించి వివరించారు. దేశంలో ఎప్పుడైనా సరే.. ఏదైనా మహమ్మారి వ్యాధి వస్తే.. దాన్ని ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతే.. అప్పుడు వారు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897ను అమలు చేయవచ్చు. దీని ప్రకారం.. అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు పెట్టే నిబంధనలను పౌరులు కచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేసి.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఇక సెక్షన్ 188 ప్రకారం.. రెండు రకాల సందర్భాల్లో.. రూల్స్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేస్తారు.
* ప్రభుత్వాలు విధించిన నిబంధనలను పాటించకపోవడం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సేవలందించే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, ఎవరైనా వ్యక్తులు గాయపడేందుకు కారణం అవడం, లేదా పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ఆటంకం కలిగించడం.. తదితర పనులు చేస్తే.. అలాంటి వారిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి.. వారిని అరెస్టు చేస్తారు. అనంతరం వారికి 1 నెల జైలు శిక్ష లేదా రూ.200 జరిమానా.. లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధించేందుకు అవకాశం ఉంటుంది.
* ఎమర్జెన్సీ సమయాల్లో ఎవరైనా సరే.. ఇతర వ్యక్తుల ప్రాణాలకు హాని కలిగించడం లేదా వారి ఆరోగ్యం, రక్షణకు ప్రమాదకరంగా మారితే.. అలాంటి వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేస్తారు. అనంతరం వారికి 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో రెండూ విధించేందుకు అవకాశం ఉంటుంది.
కనుక ఎవరైనా సరే.. కరోనా వైరస్ నేపథ్యంలో బయటకు వెళ్లి తిరుగుదామనుకుంటే ఒక్కసారి పైన తెలిపిన శిక్షలను గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు 10 రోజులు ఓపిక పడితే చాలు.. లేదంటే నెలల తరబడి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది..!