ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణలు చిక్కుల్లో పడ్డారు. ఆ ఇద్దరితోపాటు మరో ముగ్గురు.. మొత్తం కలిపి ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రాజస్థాన్‌లోని జైపూర్ జ్యోతినగర్ పోలీస్ స్టేషన్‌లో బల్బీర్ జఖర్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణతోపాటు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్, డాక్టర్ అనేరాగ్ తోమర్, పతంజలి ఆయుర్వేద సైంటిస్టు వర్షిణిలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420, 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేశామని జైపూర్ సౌత్ అడిషనల్ డీసీపీ అవినాష్ పరాశర్ తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాది జఖర్ మాట్లాడుతూ.. ఆ ఐదుగురూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే యత్నం చేశారని ఆరోపించారు. రాజస్థాన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు వారు తమ క్లినికల్ ట్రయల్స్ గురించి, కరోనైల్ ట్యాబ్లెట్ గురించి చెప్పలేదన్నారు. కాగా పతంజలి ఆయుర్వేద మాత్రం ఎమర్జెన్సీ పేషెంట్లు కాక.. కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు తమ కరోనైల్ ట్యాబ్లెట్లతో కేవలం 3 నుంచి 7 రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని ఇది వరకే తెలిపింది. అయితే మరోవైపు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మాత్రం తమకు పతంజలి చెబుతున్న వివరాలు తెలియవని పేర్కొంది.
ఇక ఆ మంత్రిత్వ శాఖ సదరు మెడిసిన్‌కు చెందిన క్లినికల్ ట్రయల్స్, రీసెర్చి వివరాలతోపాటు.. అందులో వాడిన పదార్థాల వివరాలను తమకు తెలియజేయాలని ఇప్పటికే పతంజలికి నోటీసులు ఇచ్చింది. అప్పటి వరకు ఈ మెడిసిన్‌పై ప్రచారం చేయకూడదని, మెడిసిన్‌ను అమ్మకూడదని చెప్పింది. అయితే పతంజలి దీనిపై స్పందిస్తూ.. తాము నిబంధనలను ఉల్లంఘించలేదని, అన్నీ సక్రమంగానే నిర్వర్తించామని, మెడిసిన్ విక్రయాలకు అనుమతులు కూడా పొందామని, త్వరలోనే వివరాలన్నింటినీ అందజేస్తామని తెలిపింది.