Republic Day 2024: ఐదుగురు తెలంగాణ రైతులకు ఢిల్లీ నుంచి రిపబ్లిక్‌ డే వేడుకలకు ఆహ్వానం

-

రిపబ్లిక్‌ డే వేడుకలు దేశం అంత సిద్ధమైంది.. రాష్ట్రాల్లో జరిగే వేడుకలు ఒక ఎత్తు అయితే.. దేశ రాజధాని ఢీల్లీ రాజ్‌పథ్‌లో జరిగే వేడుకలు ఒక ఎత్తు.. ప్రపంచ దేశాలు సైతం ఈ వేడుకలను వీక్షిస్తాయి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడకులు తెలంగాణ నుంచి ఐదుగురి రైతులకు ఆహ్వానం లభించింది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమైన విషయం..

తెలంగాణలో పండ్ల తోటలు, కూరగాయలు పండిస్తున్న ఐదుగురి రైతులకు 75వ రిపబ్లిక్ డే సంబరాలలో పాల్గొనే అరుదయిన గౌరవం లభించింది. వివిధ పంటలు పండించడంలో పేరుపొందిన ఈ ఐదుగురి రైతులను కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సంబరాలలో పాల్గొనడానికి ఆహ్వానించింది. రైతులతో పాటు వారి భార్యలకు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసి మరీ రిపబ్లిక్ డే సంబరాలలో పాల్గొనాలని కోరింది. వీరితోపాటు వనపర్తి జిల్లాకు చెందిన హార్టికల్చర్ అధికారి శ్రీకాంత్‌ని కూడా ప్రభుత్వం డిల్లీకి ఆహ్వానించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం కదా..! ఇంతకీ ఆ రైతులు ఎవరు..?

కూరగాయల రైతు హనీఫ్

సంగారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ హనీఫ్ అనే రైతు, గుమ్మడిదల మండలంలోని మంబాపూర్లో 20 ఎకరాలలో కూరగాయలు పండిస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఒక్క సంవత్సరం కోటి రూపాయలకు పైగా సంపాదించాడు హనీఫ్. వ్యవసాయం మీద ఏళ్ల తరబడి కష్టపడినా అప్పులు తీరడానికే సరిపోదు.. అలాంటి ఒక్క ఏడాదిలో కోటికి పైగా సంపాదన అంటే.. చరిత్రే..! హనీఫ్‌ వ్యవసాయం చేసే తీరు చూసిన అప్పటి సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు, దళితబంధు లబ్దిదారులకు ఎలా లాభసాటి వ్యవసాయం చేయాలో నేర్పించాలని కోరారు. జిల్లా మొత్తం మీద కూరగాయల పండించడంలో ఎందరికో మార్గదర్శిగా నిలిచాడు హనీఫ్. హనీఫ్ తో పాటు, తన భార్య అలియా బేగం కూడా ఇప్పటికే గణతంత్ర సంబరాలలో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరారు.

28 రకాల మామిడి పండ్లు పండిస్తున్న శ్రీరామ్

జహీరాబాద్ మండలంలోని బుర్ధిపాడ్ గ్రామంలో రైతు శ్రీరామ్‌ తన వ్యవసాయ క్షేత్రంలో 28 రకాల మామిడి పండ్లు పండిస్తున్నాడు. గణతంత్ర సంబరాలలో పాల్గొనడానికి అవకాశం లభించింది. తెలంగాణ మొత్తం మీద ఐదుగురు రైతులకు ఆహ్వానం వస్తే, అందులో ఇద్దరు రైతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావటం విశేషం. జహీరాబాద్ పట్టణంలో చిన్న వ్యాపారం చేస్తూ తన జీవితాన్ని ప్రారంభించిన శ్రీరామ్‌‌కు వ్యవసాయం అంటే చిన్నప్పటి నుండి కూడా మక్కువ. వ్యాపారంలో తనకు వచ్చిన డబ్బులు మిగిలిస్తూ, జహీరాబాద్ దగ్గర్లోని బుర్ధిపాడ్ గ్రామంలో 20 సంవత్సరాలలోనే 50 ఎకరాల భూమి కొన్నాడు. తనకున్న భూమిలో 32 ఎకరాలలో 28 రకాల మామిడి పండ్లు పండిస్తున్నాడు. ఇందులో బంగినపల్లి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న రసాలు, పచ్చడ రకం, అల్ఫాన్సోతో పాటు మరెన్నో రకాల మామిడి పంటలను పండిస్తున్నాడు. రాష్ట్రంలోని చాలామంది విఐపిలు ప్రతి సంవత్సరం తన తోట నుండి పండ్లను తీసుకెళ్తుంటారట. చివరి మామిడి పండ్ల సీజన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ 100 డబ్బాల మామిడి పండ్లు తన తోట నుండి కొనుగోలు చేసి రాజభవన్‌లో పనిచేసే వారందరికీ బహుమంతిగా ఇచ్చారు.

శ్రీరామ్ ప్రతి సంవత్సరం తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్‌కు, సంగారెడ్డి కలెక్టర్ వంటి వీఐపిలకు తన తోటలో పండిన రుచికరమైన మామిడి పండ్లు పంపిస్తుంటారు. భార్య అంబికాతో కలిసి శ్రీరామ్, న్యూ ఢిల్లీ గణతంత్ర సంబరాలకు బయలుదేరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన రైతు పెనుబల్లి గంగరాజు

పెనుబల్లి గంగరాజు, లక్ష్మి దంపతులు భద్రాచలం డివిజన్‌లో ఆయిల్‌పామ్‌ సాగులో ముందున్నారు. వారు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు.తద్వారా ఇతరులను అదే విధంగా అనుసరించడానికి ప్రేరేపించారు. రైతు దంపతులు ‘ఫెర్టిగేషన్’ వంటి ఆధునిక పోషక నిర్వహణ పద్ధతులను ఉపయోగిస్తారు. ఇందులో కరిగిన ఎరువులను నీటిపారుదల వ్యవస్థ, మల్చింగ్, బిందు సేద్యం ద్వారా పంటలను పండించడానికి పంటలకు సరఫరా చేస్తారు.భద్రాచలం డివిజన్‌లో ఆయిల్‌పామ్‌ సాగుతో పాటు దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం కమలాపురం గ్రామంలో గంగరాజు దంపతులు తమకున్న ఎనిమిది ఎకరాల భూమిలో డ్రాగన్‌ ఫ్రూట్‌, యాపిల్‌ బేర్‌, తైవాన్‌ జామ, కూరగాయలతోపాటు అంతర పంటగా సాగుచేస్తున్నారని తెలిపారు. వీరు కూడా ఢీల్లీకి బయలుదేరారు.

వీరితో పాటు వనపర్తి జిల్లాకు చెందిన విట్ట సూర్యచంద్ర రెడ్డి, ఎమ్ కృష్ణయ్య అనే రైతులకు కూడా ఈ అరుదైన గౌరవం లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version