ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోయిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి 5 ఏళ్లు పూర్తయింది. కడప జిల్లా వైఎస్ఆర్ సమధి వద్ద జగన్ పాదయాత్రను మొదలుపెట్టారు. 14 నెలలపాటు సుదీర్ఘంగా 13జిల్లాల్లో నడిచి ఇచ్చాపురంలో ముగించారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నుంచి జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు.
13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, అది 14నెలల పాటు సాగింది. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగిసింది. మొత్తం 3వేల 648 కిలోమీటర్లు జగన్ నడిచారు. 13జిల్లాలు, 134నియోజకవర్గాలు, 231మండలాల పరిధిలోని 2వేల 516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్ పర్యటించారు.
124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక వచ్చిన ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించారు. మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఇవాళ్టితో ఐదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు హాజరుకానున్నారు.