ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పండగ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో భారీ సంఖ్యలో అమ్మకాలు జరుగుతాయి. ఈ క్రమంలో వస్తువులను వినియోగదారులకు సప్లై చేసేందుకు గాను ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం అవుతారు. అందుకుగాను ఫ్లిప్‌కార్ట్ 70వేల మందిని నియమించుకోనుంది.
ఫ్లిప్‌కార్ట్ సంస్థ నియమించుకోనున్న ఉద్యోగులు సప్లై చెయిన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ అవకాశం వల్ల ఎంతో మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ ఇ-కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా మాట్లాడుతూ.. తమ కస్టమర్లకు ఓ వైపు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ను అందిస్తూనే మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడం సంతోషంగా ఉందన్నారు.
కాగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ సప్లై చెయిన్‌లో నియమించుకునే వారికి పలు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. క్లాస్ రూం, డిజిటల్ పద్ధతిలో శిక్షణ ఇస్తోంది. దీంతో అభ్యర్థులు సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.