రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ పాలన సాగుతున్న తీరుపై ప్రజలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో గ్రామ,వార్డు సభల్లో ప్రజలు ఎదురుతిరుగుతున్నారు.
ఇదిలాఉండగా, 2023లో శంకుస్థాపన చేసిన పనులకే మళ్ళీ శంకుస్థాపన చేసేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ సిద్ధమయ్యారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా ఇన్‌చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే దేవరకద్రలో 100 పడకలు, మక్తల్‌లో 150 పడకల ఆసుపత్రికి 2023లో అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు శంకుస్థాపన చేయగా.. దేవరకద్రలో పనులు ప్రారంభం అయ్యాక కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్ రద్దు చేసింది. తాజాగా శంకుస్థాపన చేసిన పనులకే మళ్ళీ ఈ హంగామా ఏంటని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు.