తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల కొండపైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నామన్నారు.
రోజు వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నామన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయి. వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు. కాగా, నిన్న 19 కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,776 మంది భక్తులు కాగా… తలనీలాలు సమర్పించిన 25,773 మంది భక్తులుగా ఉన్నారు. హుండీ ఆదాయం 3.72 కోట్లుగా నమోదు అయింది.