అధికారం పోయి అందరూ డీలా పడితే.. కొత్తగా ఇచ్చిన పదవులు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
ఒకప్పుడు టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. పార్టీకి బలమైన నాయకత్వంతోపాటు కేడర్ కూడా ఉండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా చేసిన వారు కూడా జిల్లాలో ఉన్నారు. కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత పట్టించుకున్న వారే లేరు. ఇలాంటి సమయంలో చంద్రబాబు చేసిన పార్టీ పదవుల పందేరం కొంత ఉత్సాహం తీసుకొచ్చినా.. కొత్త తలనొప్పులు కూడా తెచ్చిపెట్టిందని అనుకుంటున్నారు.
ప్రస్తుతం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు పైకి నవ్వుతూ పలకరించుకుంటున్నా.. తెర వెనక మాత్రం ఎవరి స్కెచ్‌లు వారు గీసుకుంటున్నారట. పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్నవారికి పదవులు ఇవ్వకుండా కొత్తవారికి పట్టం కట్టడంపై ఓవర్గం రుసరుసలాడుతున్నట్టు సమాచారం. జిల్లాలో టీడీపీకి పార్టీ ఆఫీస్ కూడా లేదు. అశోక్‌గజపతి రాజు బంగ్లానే పార్టీ ఆఫీసుగా ఉంటోంది. సుజయ్‌కృష్ణ రంగారావు మంత్రి అయిన సమయంలో క్యాంప్ కార్యాలయం పేరుతో ఆఫీసు పెట్టడానికి ప్రయత్నించి వెనక్కి తగ్గారు.
పార్టీ పదవి దక్కని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఓ భవనానికి విజయనగరం పార్లమెంటరీ టీడీపీ ఆఫీస్‌గా బోర్డు పెట్టి తన నిరసన తెలిపారు. ఇప్పుడు అప్పలనాయుడు బాటలో మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా వేరుకుంపటి పెడుతున్నారట. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా తనను కాదని అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకున్నారని అశోక్ గజపతిరాజుపై మీసాల గీత ఆగ్రహంతో ఉన్నారట. ఇద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారట.
పార్టీ పదవుల్లో సైతం తనకు ప్రాధాన్యం లేకపోవడానికి అశోక్ గజపతిరాజే కారణమని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అనుమానిస్తున్నారట. ప్రస్తుతం ఇద్దరు నాయకుల అనుచరుల మధ్య అస్సలు పడటం లేదని సమాచారం. దీంతో తన సామాజికవర్గానికి చెందిన కేడర్‌ను కాపాడుకోవడానికి విజయనగరంలో కొత్త ఆఫీసు ప్రారంభానికి గీత సిద్ధమవుతున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి టీడీపీ కేడర్‌లో కన్ఫ్యూజన్ మొదలైందట. ఎవరికి మద్దతు పలికితే ఏం జరుగుతుందో అన్న భయంలో ఉన్నారట. దీంతో పార్టీ ఒకటే అయినా.. రెండు జెండాలుగా విడిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయట.
రోజు రోజుకూ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఈ సమస్యపై గ్యాప్ పెరుగుతున్నట్టు సమాచారం. దీనిపై కొందరు నాయకులు ఆందోళన చెందుతున్నా పైకి మాట్లాడటానికి సాహసించడం లేదట. చంద్రబాబు జోక్యం చేసుకుంటేగానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదని అనుకుంటున్నారట.