వచ్చే ఏడాది జరిగబోయే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా సాగేందుకు ముందు అడుగులు వేస్తుంది . ఈ నేపథ్యంలో ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందువలన ఎన్నికలకు సంబంధించిన వ్యూహాల పై చర్చించేందుకు ఈనెల 21వ తేదీన భేటీ కావాలని యోచిస్తుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలు మరియు బిజెపిని ఎలా ఓడించాలి అనే అంశలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ నెల 19వ తేదీన ఇండియా కూటమి సమావేశం జరిగిన రెండు రోజులకు ఈ భేటీ జరగబోతుంది. ఇండియా కూటమి సమావేశంలో పార్టీల మధ్య సీట్ల పంపకము మరియు ఇతర కీలక అంశాల గురించి ప్రస్తావించనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టబోయే యాత్రలో ధరల పెరుగుదల మరియు నిరుద్యోగానికి సంబంధించిన అంశాలను ఎలా అస్త్రాలుగా మార్చుకోవాలని ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాహుల్ గాంధీ గత సంవత్సరం తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి తూర్పు నుంచి పశ్చిమ వైపు యాత్ర నిర్వహించాలని అనుకుంటున్నారు. గత నెల విడుదలైన ఎన్నికల ఫలితాలలో నాలుగు రాష్ట్రాలలో ఓటమిపాలై కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ఈ విషయం పైన కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.