చుండ్రు అనేది చాలా సాధారణమైన సమస్య. అలా అని తేలికగా వదిలేస్తే పెద్ద సమస్యగా మారి మిమ్మల్ని చిరాకుకి గురి చేయవచ్చు. చుండ్రు ఏర్పడడానికి కారణాలు చాలా ఉన్నాయి. వయస్సు, తినే ఆహారాలు, వేసుకునే మందులు, సొరియాసిస్, డెర్మటైటిస్ మొదలగు కారణాలుగా కూడా చుండ్రు కలుగుతుంది. కేశ సంరక్షణలో అధిక భాగం ప్రాధాన్యత జుట్టు సరిగ్గా శుభ్రపర్చుకోవడం మీదే ఉంటుంది. జుట్టుని శుభ్రపర్చుకోవడంలో కలిగే నిర్లక్ష్యం చుండ్రుని తీసుకువస్తుంది.
చుండ్రుని పోగొట్టి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆయుర్వేద నిపుణులు సూచించే చిట్కాలు
మన చర్మకణాలు ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పడతాయి. పాతవాటి స్థానంలో కొత్తవి ఏర్పడుతూనే ఉంటాయి. చుండ్రుతో బాధపడుతున్నవారికి ఇది తరచుగా చాలా త్వరగా జరుగుతుంటుంది. పాత చనిపోయిన కణాలే చుండ్రుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పొడిచర్మం గల వారికి చుండ్రు చాలా త్వరగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. రెగ్యులర్ గా జుట్టిని శుభ్రపర్చుకోకపోయినా లేదా తరచుగా షాంపూ, కండీషనర్ వాడినా చుండ్రు కలుగుతుంది. షాంపూల అధిక వాడకం చర్మాన్ని, హార్మోన్లని డిస్టర్బ్ చేస్తాయి.
చిట్కాలు
కొబ్బరి నూనెని వేడిచేసి దానిలో పిడికెడు వేప ఆకులు, చేతినిండా కరివేపాకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత చల్లారే వరకు ఆగి, రోజు తప్పించి రోజు తలకి మర్దన చేసుకోవాలి. 30నిమిషాల తర్వాత తక్కువ షాంపుతో శుభ్రపర్చుకుంటే చాలు.
మెంతులని రాత్రిపూట నానబెట్టి తెల్లారి వాటిని గ్రైండ్ చేసి ఆ పేస్టుని మరునాడు తలకి పెట్టుకోవాలి.
ఉసిరి పొడి లేదా త్రిఫల చూర్ణాన్ని తలకి పట్టించినా ఫలితం ఉంటుంది. ఆ తర్వాత తలస్నానం చేయాలన్న విషయం గుర్తుంచుకోవాలి.
కొబ్బరినీళ్ళు, నిమ్మరసాన్ని మిక్స్ చేసి నెత్తికి పట్టించాలి. తర్వాత తలస్నానం చేయాలి.
కొద్దిగా వేడిచేసిన కొబ్బరినూనెకి ఉసిరిపొడిని కలిపి తలకి మర్దన చేయాలి.