పాతబస్తీ పాలిటిక్స్..ఎంఐఎం స్పీడ్‌కు బీజేపీ బ్రేకులు

-

ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. తెలంగాణలోనైనా పాతబస్తీ పాలిటిక్సే వేరు. అధికారంలో ఎవరున్నా అక్కడ ఎగిరే జెండా ఒక్కటే. పాతబస్తీ అంటేనే ఎంఐఎం కంచుకోట. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్లు ఎంఐఎం ఎమ్మెల్యేలున్నారు. ఆ ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎంకు తిరుగుండదు. అక్కడ వాళ్లదే రాజ్యం. వాళ్లు చెప్పిందే రాజకీయం. మరి అలాంటి చోట ఈసారి గ్రేటర్ పాలిటిక్స్ఎలా ఉండబోతున్నాయి.గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సవాల్ విసురుతున్న బీజేపీ పాతబస్తీలోనూ సత్తా చాటుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్త్తిరేపుతుంది.

ఏ ఎన్నికలైనా హైదరాబాద్ పాతబస్తీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే అయితే ప్రత్యేకంగా చెప్పేదేముంటి..? లోకల్‌ ఫైట్‌లో ఎంఐఎం హవా పాతబస్తీలో స్పష్టంగా కనిపిస్తుంది. పాతబస్తీ అంటేనే ఎంఐఎం… ఎంఐఎం అంటేనే పాతబస్తీ అన్నట్లుగా ఇక్కడి రాజకీయం ఉంటుంది. ఆ పార్టీకి పాతబస్తీ కంచుకోట కావడంతో .. రాజకీయ పార్టీలు ఇక్కడ పాగా వేసేందుకు పెద్ద ప్రయత్నించవు. ఇతర పార్టీలేవీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపవు. అయితే కొంతలో కొంత బీజేపీ కయ్యానికి కాలుదువ్వుతుంది. పాతబస్తీలో రాజకీయ ప్రత్యర్థులు ఈ రెండు పార్టీలే.

పోటీ ఎలా ఉన్నా అంతో ఇంతో ఎంఐఎం స్పీడ్‌కు బ్రేకులు వేసేది మాత్రం బీజేపీనే. నగరంలో ఈరెండు పార్టీల మధ్య ఎప్పుడూ యుద్ధమే. అలె నరేంద్ర మొదలుకుని.. దత్తత్రేయ, బద్దం బాల్ రెడ్డి లాంటి నాయకులు ఎంఎఐఎంని కట్టడిచేసే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వారితో ఎంఐఎం దోస్తానా కొనసాగుతుంది. గ్రేటర్ ఎన్నికలకు వచ్చే సరికి అధికారంలో ఉన్న పార్టీలతో స్నేహపూర్వక పోటీ అని అంటుంది ఎంఐఎం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య అండర్ స్టాడింగ్‌ నడిచింది. రెండు పార్టీలు కలిసి పాతబస్తీలో రాజకీయ చక్రాన్ని తిప్పాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత… టీఆర్‌ఎస్‌తో అవగాహనను కొనసాగిస్తోంది ఎంఐఎం.

నగరంలోని ఇతర ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్‌ఎస్‌… పాతబస్తీలో ఉనికి చాటుకున్నప్పటికీ, ఎంఐఎం తన పట్టును నిలుపుకుంది. 44 డివిజన్లలో ఎంఐఎం విజయం సాధించింది. ఇక పాతబస్తీ స్వరూపాన్ని పరిశీలిస్తే, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గోషామహల్ మినహాయిస్తే అంతటా ఎంఐఎందే హవా. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో.. మాజీ మంత్రి ముఖేష్ హవా కొనసాగింది. కానీ ముఖేష్… హవాకు దెబ్బకొట్టిన రాజాసింగ్.. రెండుసార్లు వరుసగా అక్కడినుంచి విజయం సాధించారు. ఆయన సామాజికవర్గం లోధా… ఓటర్లు ఎక్కువగా ఉండటంతో గోషామహల్ బీజేపీకి అండగా నిలుస్తోంది.

గ్రేటర్‌లో 150 డివిజన్ల ఉంటే 43 డివిజన్లు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. మలక్‌పేట నియోజకవర్గంలో 6 డివిజన్లు, కార్వాన్లో 6, గోషామహల్‌లో 6, చార్మినార్‌లో 4, చంద్రాయణ గుట్టలో 7, యాకుత్ పురాలో 8, బహదూర్‌పురాలో 6 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 60 స్థానాలకు పోటీచేసిన ఎంఐఎం అందులో 44 డివిజన్లను గెలుచుకుంది. ఈ సారి మాత్రం 58 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేసింది. పాతబస్తీలో ప్రధానంగా ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఎంఐఎం, బీజేపీ మాత్రం నువ్వానేనా అన్నట్లు తలపడనున్నాయి. గోషామహల్లోని ఒకటి.. రెండు డివిజన్లలో కాంగ్రెస్ బలంగా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version