గ్రేటర్ పోరుకు వారం రోజులే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు డివిజన్లలో గెలుపోటములపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టీఆర్‌ఎస్ మంత్రులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. దుబ్బాక ఓటమి తర్వాత ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడంతో డివిజన్ ఇంఛార్జ్‌లు గా ఉన్న మంత్రులు,ఎమ్మెల్యేల టెన్షన్ పీక్స కి చేరింది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు సొంత టీంలను రంగంలోకి దించి ప్యూహలు రచిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కో పార్టీది ఒక్కో ఎత్తుగడ. అధికార పార్టీ అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించి సిటీ మొత్తం చుట్టేస్తోంది. మొదటి సారిగా డివిజన్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంఛార్జ్‌లుగా పెట్టడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. ఒక డివిజన్ అంటే చిన్నగా ఉంటుంది. అలాంటి ప్రాంతానికి మంత్రి ఇంఛార్జ్‌గా రావడం కొత్తగా ఉన్నా.. పార్టీ మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నది స్పష్టమవుతోంది.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 మంది కార్పొరేటర్ల దగ్గర ఆగిన టీఆర్‌ఎస్ ప్రయాణం.. ఈసారి వంద దాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకే అన్ని అస్త్రశస్త్రాలను గ్రేటర్ లోనే మొహరించింది టీఆర్‌ఎస్. ఇప్పటికే ఎన్నికల ప్రచార గోదాలోకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు. అయితే.. పోటీలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థి సత్తా సరిపోవడం లేదని భావించారో ఏమో తమ సొంత టీమ్‌లను కూడా రంగంలోకి దించేశారట. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రచారంలో డివిజన్లస్థాయిలో ఇలాంటి టీమ్‌లు హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. అధిష్ఠానం ఇచ్చిన టార్గెట్లో లేక దుబ్బాక ఇచ్చిన చేదు అనుభవం ఫలితమో కానీ.. ఇంఛార్జులుగా ఉన్న నాయకులకు మాత్రం కంటిపై నిద్ర కరువైందనే ప్రచారం జరుగుతోంది.
స్థానిక నాయకులతో కలిసి ఈ టీమ్‌లు సమన్వయం చేసుకుంటూ పనిచేశాలా మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన వంద నుంచి రెండు మూడొందల మంది కార్యకర్తలు చొప్పున నగరంలోకి వచ్చినట్టు సమాచారం. వారికి అవసరమైన ట్రావెలింగ్, లాడ్జింగ్ అంతా నాయకులే చూసుకుంటున్నారట. డివిజన్లలో పార్టీకి ఎలాంటి ప్రతికూలత వ్యక్తం కాకుండా.. బలం చాటే విధంగా ఇలాంటి టీమ్‌లు ఇంటింటా ప్రచారం చేస్తున్నాయని సమాచారం.
దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా నిలిచాయన్నది అధికార పార్టీ నాయకులు చెప్పే మాట. ఒక్క పార్టీకే కాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతలు స్వీకరించిన పార్టీ నేతలందరికీ రాజకీయంగా ఇది జీవన్మరణ సమస్యగా మారబోతున్నట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తమకు అప్పగించిన ప్రాంతాలలో ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధులను గెలిపిస్తే అధిష్ఠానం దగ్గర మంచి మార్కులు పడతాయి. ఒకవేళ ఆశించిన స్థాయిలో డివిజన్లు గెలవకపోతే రాజకీయ భవిష్యత్‌కు గ్రహణం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారట.
అందుకే ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్ రెబెల్‌గా బరిలో ఉన్నవారి.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న స్థానిక టీఆర్‌ఎస్ నాయకులను బుజ్జగించే పనిని కూడా ఎత్తుకున్నారట ఇంఛార్జులుగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. రెబెల్స్‌దారిలోకి వచ్చిన చోట సగం విజయం సాధించినట్టుగా భావిస్తున్నారట నాయకులు. మరీ వీరి ప్యూహలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలుసుకోవాలంటే ఫలితాలవరకు వేచి చూడాల్సిందే…