దేశంలో పాటు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసిన తెలంగాణ సర్కార్… మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇది ఇలా ఉండగా కోవిడ్ టీకా విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో పని చేస్తున్న ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్ తీసుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతించనున్నట్లు వెల్లడించింది. ఇక ఏప్రిల్ 15 లోపు ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పని చేసే 30 వేల మంది సిబ్బందికి టీకా ఇచ్చేందుకు అటు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. 45 ఏళ్లు పైబడిన వారందరికి కరోనా టీకా ఇవ్వాలనే లక్ష్యంతో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలానే కార్యాలయాల వద్దకే కరోనా టీకా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. కనీసం 100 మంది వ్యక్తులు టీకా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.