నేడు విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం..

-

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్‌ రాకేష్‌ తివారీ పేర్కొన్నారు.

ఈ ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికి పైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. మేళతాళాలు, తీన్‌మార్‌ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించనున్నారు ఊరేగింపు కమిటీ సభ్యులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version