పోలవరం నిర్వాసితులకు జగన్‌ శుభవార్త !

-

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం జగన్‌కు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మాట్లాడుతూ… గతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై దృష్టిపెట్టలేదు. ఆర్‌ అండ్‌ఆర్‌ పనులను పూర్తిగా వదిలేశారని… మన ప్రభుత్వం వచ్చాక ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై పూర్తి దృష్టిపెట్టామన్నారు.

ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదని.. కచ్చితంగా నాణ్యత ఉండాలని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు.. సహజంగానే ఎక్కడోచోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్‌. ఆ అధికారి ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను తప్పకుండా అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్న సీఎం… తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు కచ్చితంగా వాటిని సరిదిద్దుకోవాలని తెలిపారు. వేగంగా నిర్మించాలని, లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్న ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, అలాంటి సందర్భాల్లో వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా జరగాలని పేర్కొన్నారు.

కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టినా సరే, నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలన్నారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న సీఎం… కాలనీల నిర్మాణంతోపాటు.. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని వెల్లడించారు. రోడ్లు, ఆతర సామాజిక అభివృద్ధి పనులను స్థిరంగా ముందుకు చేసుకుంటూ వెళ్లాలని తెలిపారు. ఆగస్టులో కొన్ని ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని… వరద ఉంటే కనుక అది మళ్లీ తగ్గేసరికి నవంబరు, డిసెంబరు పట్టే అవకాశాలు ఉంటాయన్నారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాసరే… ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి బిల్లులు ఎక్కడా పెండింగులో పెట్టడంలేదని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version