ఎట్టకేలకు మిడ్ మానేరు నిర్వాసితుల కల నెరవేరింది. ప్రాజెక్ట్ నిర్మాణం టైంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మొత్తం 12 గ్రామాల్లొని నిర్వాసితులకు 4,696 ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొంది. బోయిన్‌పల్లి మండలం మాన్వాడ వద్ద 25.6 టీఎంసీల సామర్థ్యంతో 2.32లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 2006లో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది.
కాగా, 2019లో దీని నిర్మాణం పూర్తయ్యింది. డ్యాం నిర్మాణంతో చుట్టుపక్కల 12 గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ 11,731 కుటుంబాలకు పరిహారాన్ని గత ప్రభుత్వాలు చెల్లించాయి. ఆర్‌అండ్ఆర్ కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 242 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాల్లో బాధితులు సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారు. వారికి రూ.5.04 లక్షలు ఇస్తామని 2015 మాటిచ్చిన కేసీఆర్ మాట తప్పారు. 2016లో మిడ్ మానేరు కట్ట తెగినప్పుడు సైతం పరిశీలనకు వచ్చిన కేసీఆర్ ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన వారికి రూ.2 లక్షలు ఇస్తామన్నారు. 4వేల మందిని అర్హులుగా గుర్తించారు. కానీ, కేవలం 2 వేల మందికి మాత్రమే డబ్బులు అందాయి.