పోలవరం విషయంలో చర్చలు జరిపేందుకుగాను ఏపీ మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్ లు ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో అరగంట కు పైగా బుగ్గన రాజేంద్రనాథ్ అనిల్ కుమార్ యాదవ్ లు సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఏపి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై కేంద్ర జలశక్తి మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. భారీగా నిధులు ఖర్చు పెట్టిన తర్వాత, ఆర్ అండ్ ఆర్ పూర్తికాక పోతే ఇబ్బంది తలెత్తుతుందని అన్నారని ఆయన అన్నారు.
ప్రాజెక్టులో “డ్రింకింగ్ వాటర్” ( తాగునీరు) కాంపోనెంట్, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని కోరామని అలానే ప్రాజెక్టు సందర్శనకు రావాలని ఆహ్వానించామని అన్నారు. 15 రోజుల్లో వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని కేంద్ర జలశక్తి మంత్రి చెప్పారని ఆయన అన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం “స్పెషల్ ప్యాకేజ్” వల్లే పోలవరంకు సమస్యలు వచ్చాయని ఈ సమస్యలన్నీ ఒక్కొటొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని అన్నారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఆయన అన్నారు.