ఆర్థిక మాంద్యం టెక్కీలను భయకంపితులను చేస్తోంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా వరకు కార్పొరేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. గత వారంలో గూగుల్ కూడా 12 వేల లేఆఫ్స్ ప్రకటించింది. కేవలం ఉద్యోగులే కాదు దిగ్గజాలకూ లేఆఫ్స్ బాధ తప్పడం లేదు.
సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అంతకంటే పై స్థాయిలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లోనూ కోత విధిస్తామని ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తన వేతనంలోనూ కోత విధించాలని సుందర్ పిచాయ్.. సిబ్బందికి సూచించినట్లు సమాచారం. అయితే ఎంత కోత విధిస్తారన్నది మాత్రం బయటకు రాలేదు. ఇక నుంచి ఏడాదికోసారి ఇచ్చే బోనస్ తగ్గిస్తామని, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల పనితీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఇస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు.
తమ తొలగింపునకు బదులు ఉన్నతస్థాయిలో పని చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు తగ్గించాలని ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా తన వేతనంలో 40 శాతం కోత విధించుకున్న సంగతి గూగుల్ ఉద్యోగులు గుర్తు చేశారట. దీంతో సుందర్ పిచాయ్ కూడా తన వేతనంలో కోత విధించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.