ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్.. స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలను వీక్షించే యూజర్లకు షాకిచ్చింది. ఇకపై ఫోన్లలో ఉండే యూట్యూబ్‌లో హెచ్‌డీ వీడియోలను యూజర్లు చూడలేరు. కేవలం 480పి రిజల్యూషన్ ఉన్న వీడియోలను మాత్రమే యూజర్లు చూడగలరు. ఈ మేరకు గూగుల్ తాజాగా నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న జనాలు పెద్ద ఎత్తున నెట్‌ను వాడుతుండడం, యూట్యూబ్ లాంటి వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో పెద్ద ఎత్తున వీడియోలను చూస్తుండడంతో.. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా యూట్యూబ్ కూడా తమ తమ యాప్‌లలో డిఫాల్ట్ వీడియో స్ట్రీమింగ్ వ్యూయింగ్ క్వాలిటీని 480కి తగ్గించాయి. కానీ యూజర్లు కావాలనుకుంటే వీడియోలను హెచ్‌డీ రిజల్యూషన్‌లో చూసే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం ఆ ఆప్షన్‌ను కూడా యూట్యూబ్ తీసేసింది. దీంతో ఫోన్లలో యూట్యూబ్‌లో వీడియోలను ఇకపై గరిష్టంగా కేవలం 480పి రిజల్యూషన్‌తో మాత్రమే చూడవచ్చు.
అయితే గూగుల్ విధించిన ఈ నిబంధన కేవలం ఫోన్లకే వర్తిస్తుంది.. పీసీలకు కాదు. పీసీల్లో యూట్యూబ్ వీడియోలను చూసే వారు తమకు నచ్చిన రిజల్యూషన్‌తో వీడియోలను చూడవచ్చు. అయితే కరోనా నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజుల వరకు గూగుల్ ఈ నిబంధనను అమలు చేస్తుందో తెలియదు. కానీ అందుకు మరో 2 నెలల వరకు అయినా సమయం పడుతుందని తెలుస్తోంది..!