రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య ఎక్కడో ఒక చోట నిత్యం ఏదో ఒక రూపంలో వివాదం నడుస్తూనే ఉంది. అవి గత ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు కావొచ్చు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల గురించిన రాజకీయాలు కావొచ్చు.. నిత్యం ఇరు పార్టీల మధ్య వివాదం జోరుగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా వైసీపీ మంత్రి సీదిరి అప్పల రాజుకు.. టీడీపీ యువ నాయకురాలు.. గౌతు శిరీషకు మధ్య కులాల పంచాయితీ చోటు చేసుకుంది. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ నాయకురాలు.. శిరీష.. ఓడిపోయారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన సీదిరి అప్పలరాజు విజయం సాధించారు. తొలి ఆరు మాసాలు వీరిమధ్య వివాదం లేకపోయినా.. ఇటీవల మాత్రం కులాల పంచాయితీ జరుగుతోంది.
అయితే దీనికి కౌంటర్‌గా శిరీష తరఫున అనుచరులు సీదిరి అప్పలరాజు.. మత్య్సకార వర్గానికి చెందిన నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారని.. నోరు విప్పితే.. తన సామాజికవర్గం పేరు చెప్పుకొని ఆ వర్గాన్ని అణిచి వేస్తోన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారేమో గాని పలాస ప్రజలు మర్చిపోవడం లేదని శిరీష ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఆయన కాళింగ సామాజకి వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు కనుక.. ఆయన కూడా గత ఎన్నికల్లో కళింగ వర్గం మద్దతుతో కూడా గెలిచారని… అలాంటప్పుడు మత్య్సకార వర్గం ఎలా ? అవుతారని శిరీష వర్గం పెద్ద ఎత్తున ఎదురు ప్రచారం చేస్తోంది. గాలిలో గెలిచిన అప్పలరాజు గాలిలోనే కొట్టుకుపోవడం ఖాయమని శిరీష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇక, ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న వివాదంలో టీడీపీ కీలక నాయకులు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు జోక్యం చేసుకున్నారు. శీరీషకు మద్దతుగా ఆయన వ్యవహరించారు. దీంతో ఇది మరింత వివాదంగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరు వర్గాల తరఫున మద్దతు దారులు కులాల పంచాయితీపై రాజకీయాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ వివాదంలో ఇద్దరూ కులాల పేరుతో పరస్పర విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయమే వినిపిస్తోంది. ముందుగా అప్పలరాజు శిరీష భర్త కులాన్ని ప్రస్తావించడం సరికాదు. శిరీష కమ్మ వ్యక్తిని వివాహం చేసుకున్నంత మాత్రాన ఆమె గౌతు లచ్చన్న వారసురాలు కాకుండా పోరు.
అలాగే మంత్రి అప్పలరాజు.. మత్స్యకారవర్గమే అయినప్పటికీ.. ఆయన కాళింగ మహిళను చేసుకున్నా.. పురుషుడు ఏ సామాజిక వర్గమైతే ఆ కులమే ఆయనకు వర్తిస్తుంది. ఏదేమైనా రాజకీయ విమర్శల్లోకి కులాల ప్రస్తావన తీసుకువచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎవరికి సరికాదు.