జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను అప్‌డేట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ రూ.8,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్‌పీఆర్ నవీకరణ ప్రక్రియ చేపడతారు. ఇవాళ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్)కు అనుమతి ఇచ్చింది. ప్రతి ఒక పౌరుడి పూర్తి డేటాబేస్‌ను తయారు చేయడమే ఎన్‌పీఆర్ లక్ష్యమని సెన్సస్ కమిషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. జనాభా వివరాల్లో ప్రతి పౌరుడు భౌగోళిక, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. ఎన్‌పీఆర్ చేయాలంటే.. పౌరులు ఎవరైనా ఒక ప్రాంతంలో ఆరు నెలల కన్నా ఎక్కువ సమయం ఉన్నవారే అర్హులు.
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్‌పీఆర్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ ప్రక్రియ జరుగుతుంది. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్‌పీఆర్ నవీకరణ చేపడతారు. కాగా, ఎన్‌పీఆర్ గణాంకాలను 2010లో సేకరించారు. 2011 భారత జనాభా లెక్కల్లో ఇండ్ల జాబితా దశలో భాగంగా ఎన్‌పీఆర్‌ను కూడా నాటి యూపీయే ప్రభుత్వం సేకరించింది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా ఈ డేటాను అప్‌డేట్ చేశారు. ఈ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది.