ఇప్పటికైనా మనం మారాలి… అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకపోతే మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు… ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికలు నిర్వహించాలంటూ తాజాగా లేఖ రాశారు ఆజాద్. ఢిల్లీకి వచ్చి వెళ్తున్న నాయకుల్లో ఎవరో ఒకర్ని రాష్ట్రలకు అధ్యక్షులుగా నియమిస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన లేఖలో పేర్కోన్నారు. పార్టీ పదవులతో పాటు జిల్లా అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్ల విషయంలో కూడా ఇదే జరుగుతోందని ఆయన అన్నారు.
అయితే, అటువంటి నేతలకు పార్టీలో ఒక శాతం మద్దతు కూడా ఉండడం లేదని అన్నారు. అయితే, తమ పదవులు పోతాయనే భయంతో దీనిని ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారాయన. పార్టీ ఇలాగే పని చేస్తే మరో 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంగానే మిగిలిపోతామన్నారు ఆజాద్. మనం పార్టీ ఎన్నికల్లో ఇద్దరు లేదా ముగ్గురితో పోటీ పడతాం కనీసం 51 శాతం ఓట్లు వచ్చిన వాళ్లే ఆయా పదవులకు ఎన్నికైనట్టు లెక్క. ఎందుకంటే మిగతా వాళ్లకు పది నుంచి 15 శాతం ఓట్లే వస్తాయి. అలాగే, 51 శాతం ఓట్లు సాధించారంటే… ఆయా నాయకుడికి పార్టీలోని కనీసం సగం మంది మద్దతు ఉన్నట్టే. ఇటువంటి వాళ్ళే ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పుడు ప్రజల మద్దతు సైతం కూడగట్టగలుగుతారని అన్నారు.