రాష్ట్రంలో మరో గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గీతాంజలి అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది.
అంతకుముందు గురుకుల ఉపాధ్యాయులు సమ్మె చేస్తుండడంతో గత నెల 29న గీతాంజలిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన గీతాంజలి పురుగుల మందు తాగగా భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గీతాంజలి శుక్రవారం మృతి చెందింది. ఉపాధ్యాయులు సమ్మె చేయకుండా ఉంటే తమ బిడ్డ బ్రతికి ఉండేదని తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, గురుకుల విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.