గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఎర్పుల సాయి కిరణ్ తన తమ్ముడు ఎర్పుల సాయి కిషోర్ (34) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. జిమ్‌లో వర్కౌట్స్ కోసం వచ్చిన అతని స్నేహితుడు చంటికి మధ్య వివాదం తలెత్తింది.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చంటి.. డంబెల్‌తో సాయి కిషోర్ తల మీద బలంగా మోదాడు. బాధితుడి తలకు తీవ్ర గాయాలవ్వగా అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కిషోర్ మృతి చెందాడు. మృతుడి అన్న సాయి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవింద రెడ్డి తెలిపారు.