రాజకీయ పార్టీల్లోనే రాజకీయాలు ఉన్నాయా అంటే అబ్బే! అదేం లేదు ఇండస్ట్రీలో అంతకుమించిన అవార్డులకు అందని రాజకీయాలు, అవార్డులు ఇచ్చే వేళ రాజకీయాలు చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ భరించి సహించి ముందుకుపోవడమే సిసలు సంకల్పానికి ప్రతీక. మన నాయకుల్లో ఎలాంటి రంగులు మార్చే ధోరణి ఉందో ముఖానికి రంగులు వేసుకుని నటించే నటుల్లోనూ సంబంధిత వర్గాల్లోనూ అనే వేషాలూ వైషమ్యాలూ ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ పెద్దగా బయటకు రాకున్నా ఎప్పుడో ఓ సందర్భంలో ఏ మా ఎన్నికల సమయంలోనో ఏ సినిమా వేడుకలోనో వెల్లడిలోకి వస్తాయి. వెలుగులోకి వస్తాయి. అప్పుడు మనుషుల నిజరూపాలు అన్నవి తేలిపోతాయి.
నిన్నటి వేళ తాడేపల్లి ప్యాలెస్ లో చిరు బృందానికి మరియు యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మధ్య చర్చలు జరిగాయి. ఇవి ఫలించాయి అని కూడా చెబుతున్నారు చిరంజీవి. ఫలించాయో లేదో అన్నది ఫిబ్రవరి మూడో వారంలో తేలిపోనుంది. అప్పటికి ప్రభుత్వం తరఫున ఓ ఉత్తర్వు వస్తుంది. ఆ తరువాతే సీన్ ఏ విధంగా ఉంటుందో లేదా ఉండబోతుందో అన్నది స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి వేళ మరో ప్రతిపాదన వచ్చింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు ప్రభుత్వాలూ మాట్లాడుకుని నంది అవార్డులు ఇవ్వాలని కోరారు. బహుశా! ఈ ప్రతిపాదన ఆర్ నారాయణమూర్తి తెచ్చి ఉంటారు. చిరు సమర్థించి ఉంటారు. ప్రాంతాలుగా రెండుగా విడిపోయాక ఎవరి పనుల్లో వారు ఎవరి ప్రతిపాదనల్లో వారు ఉన్నాక ఇవాళ ఆయన చెప్పిన మాట ఒడ్డెక్కుతుంది అని అంటారా? ఏమో! అయితే మంచిదే!
గతంలోనూ నందీ అవార్డులు ఇచ్చారు. రాష్ట్రం విడిపోక ముందు రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ వీటిని ప్రధానం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇవ్వలేదనే భావించాలి. ఒకవేళ ఇస్తే మంచిదే! కానీ ఈ నందుల ఎంపికల్లోనూ రాజకీయాలుండేవి. అప్పట్లో కూడా స్క్రీనింగ్ కమిటీల పేరిట చాలా వివాదాలు నడిచేవి.
ఆఖరికి ఒకే అవార్డును ఇద్దరు పంచుకున్న దాఖలాలు ఉన్నాయి కూడా! ఏదేమయినప్పటికీ ఇప్పుడు నందులు లేవు. సంబంధిత ప్రోత్సాహకాలకు తావేలేదు. ప్రయివేటు సంస్థలు ఇస్తున్న అవార్డులు తప్ప సినిమావాళ్ల ప్రాంతాల పరిధిలో ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు లేనేలేవు. ఒకవేళ ఇస్తే మళ్లీ వివాదాలు రేగుతాయా?