హమారా సఫర్ : హిజాబ్ వివాదం ఇంకా ఉంది ! దేవుడా !

-

అభివృద్ధి గురించి మాట్లాడాలి మాట్లాడ‌రు
వెనుక‌బాటు గురించి చ‌ర్చించాలి చ‌ర్చించ‌రు
వీటిని వ‌దిలి కొస‌రు వివాదాలతో కాల‌క్షేపం చేయ‌డం
దేశానికి శ్రేయోదాయకం కాదు కాషాయం నీడ‌లో కొంద‌రు
న‌ల్ల‌టి ప‌రదాల మాటున ఇంకొంద‌రు విద్యార్థుల‌ను
ఆస‌రాగా చేసుకుని రాజ‌కీయం న‌డ‌ప‌డ‌మే ఇప్ప‌టి విషాదం
దేవుడా ! ర‌క్షించు నా దేశాన్ని..

క‌ర్ణాట‌క‌లో పుట్టిన హిజాబ్ వివాదం సుప్రీం వ‌ర‌కూ ఇవాళ పోయింది. నిన్న‌టి వేళ తుది తీర్పు వెలువ‌రించే వ‌ర‌కూ సంప్ర‌దాయ వ‌స్త్రాలు నిషేధం అంటూ ఆ రాష్ట్ర హైకోర్టు మౌఖిక తీర్పు ఇచ్చిన నేప‌థ్యాన కొంద‌రు విద్యార్థినిలు ఈ విష‌య‌మై త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని కోరుతూ అత్యున్న‌త న్యాయ స్థానం మెట్లెక్కారు. దీంతో సుప్రీం కోర్టుకు హిజాబ్ వివాదం అన్న హెడ్డింగ్ ఇవాళ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

ఇదే విష‌యం వైర‌ల్ అవుతోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ విష‌యం క‌ర్ణాట‌క హైకోర్టు ప‌రిధిలో ఉన్నందున వాళ్లు చెప్పిన తుది తీర్పు త‌రువాతే తాము పిటిష‌న్ ను ప‌రిశీలిస్తామ‌ని సుప్రీం చెబుతోంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఇదే విష‌యమై చ‌ర్చ న‌డుస్తోంది. విద్యాల‌యాల‌కు వెళ్లిన బిడ్డ‌లు చ‌దువుకోకుండా ఎందుక‌ని మత సంబంధ వివాదాల్లో ఇరుక్కుపోతున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు ఆవేద‌న చెందుతున్నారు.

ఇక ఈ వివాదంలో కొన్ని మ‌త‌త‌త్వ సంస్థ‌లు జోక్యం చేసుకోవ‌డంపై కొంత వివాదం పెరిగి పెద్ద‌ద‌వుతోంది. అటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ కాస్త సంయ‌మ‌నంతో ఉంటే స‌మ‌స్య ప‌రిష్కారానికి నోచుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ బీజేపీ దీన్నొక రాజ‌కీయ అంశంగా మార్చేందుకు చూస్తోంద‌ని సంబంధిత విప‌క్షం విమ‌ర్శిస్తోంది. ఇదే వివాదాన్ని కశ్మీరీ పార్టీలు సీరియ‌స్ గా తీసుకున్నాయి. వాళ్లు కూడా త‌మ‌దైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఎప్ప‌టి నుంచో ఉన్న ఆచారంపై ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన అభ్యంత‌రాలు ఏంట‌న్న‌ది ఇంకొంద‌రి ప్ర‌శ్న.

పాఠ‌శాల‌ల‌కు యూనిఫాం వేసుకునే వ‌స్తామ‌ని ఆ రోజు విద్యార్థినులు హామీ ఇచ్చార‌ని కానీ ఇప్పుడు మాట మార్చార‌ని ఇంకొంద‌రు హిందుత్వ వాదులు త‌మ వాద‌న వినిపిస్తున్నారు. ఎవరి వాద‌న ఎలా ఉన్నా దేశంలో ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రుగుతున్నందున పార్టీలు దీన్నొక రాజ‌కీయ స‌మ‌స్య‌గానే మార్చేందుకు,త‌ద్వారా ల‌బ్ధిపొందేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీటి మాయ‌లో ప‌డ‌కుండా ప్ర‌జ‌లంతా సామర‌స్యంతో మెల‌గాల్సిన త‌రుణం ఇదే అన్న‌ది ఇప్ప‌టి ప్ర‌జాస్వామ్యవాదుల విన్న‌పం.

Read more RELATED
Recommended to you

Exit mobile version