జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అంజన్న క్షేత్రానికి తరలివస్తున్నారు. గుట్ట కింద నుంచి పురాతన మెట్లదారి, ఘాట్ రోడ్డు, నాచుపల్లి గ్రామాల మీదుగా దీక్షాపరులు, భక్తులు అంజన్ని సన్నిధికి చేరుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజామున భారీ సంఖ్యలో దీక్షాపరులు మాలవిరమణకు పోటెత్తారు.
చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున పలువురు దీక్షాపరులు స్వామి సన్నిధిలో మాల విరమణ చేశారు. అర్చకులు ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి, దీక్షా విరమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం రాత్రి ఆలయ పరిసరాల్లోనే నిద్రించిన దీక్షాపరులు మాల విరమణ మండపానికి ఒక్కసారిగా తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన మాల విరమణ ఏడు గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది.
స్వామి వారి జయంతి గురువారం రోజున లక్షలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకొని తాము స్వీకరించి దీక్షను స్వామి సన్నిధిలో విరమిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.