హుజూర్‌న‌గ‌ర్లో ట్ర‌బుల్ షూట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేనా..!

-

పార్టీకి వీర విధేయుడు.. పార్టీ అధినేత‌కు న‌మ్మిన‌బంటు..పరిపాల‌న‌లో త‌న‌దైన శైలీలో ప‌నిచేసే న‌మ్మ‌క‌మైన నేత‌…  పార్టీలో ఏ స‌మ‌స్య‌నైనా ఇట్టే ప‌రిష్క‌రించ‌డంలో దిట్ట‌.. ఎక్క‌డ ఎన్నికలైనా అక్క‌డ త‌న‌దైన మార్క్ రాజ‌కీయ చ‌తుర‌తతో కార్య‌క‌ర్త‌లను న‌డిపించే నాయ‌కుడు… ఎన్నిక‌ల్లో స‌మ‌స్య వ‌చ్చిందంటే ప‌రిష్కారం చూప‌డంలో ట్ర‌బుల్ షూట‌ర్‌గా కీర్తినందుకుంటున్న ఈ నేత ఇప్పుడు రంగంలోకి దిగాడు. ఇంత‌కాలం పార్టీ పెద్ద‌పీట వేయ‌కుండా గ‌ప్‌చుఫ్‌గా ఉంచింది. దానికి త‌గ్గ‌ట్టుగానే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దైన శైలీలో ప‌నిచేసుకుంటూ ముందుకు సాగారు..

ఇటీవ‌లే తిరిగి అమాత్య ప‌ద‌వి కట్ట‌బెట్టి స‌ర్కారులో పెద్ద పీట వేశారు. అయితే ఇప్పుడు వ‌చ్చిన స‌మస్య‌ను ధీటుగా ఎదుర్కొనే విధంగా ఈ ట్ర‌బుల్ షూట‌ర్‌ను రంగంలోకి దింపారు ఆ పార్టీ బాస్‌.. ఇంత‌కు ఏ పార్టీ.. ఎవ‌రా ట్ర‌బుల్ షూట‌ర్‌.. ఎక్క‌డ రంగంలోకి దిగార‌ని అనుకుంటున్నారా.. అయితే మీరు చూడండి..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి త‌న్నీరు హరీష్‌రావు. గులాబీ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరున్న నాయ‌కుడు. హ‌రీష్‌రావు ఎక్క‌డైనా ఉప ఎన్నిక‌లు జ‌రిగాయంటే ఆయ‌న అక్క‌డ వాలితే ఆ సీటు గెలిచి తీరాల్సిందే.

స‌మ‌స్య ఉన్న ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో కాలుమోప‌డం, అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌ను స‌న్న‌ద్ధం చేయ‌డం, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం, నేత‌ల‌ను ముందుకు న‌డిపించి గెలుపును అందుకోవ‌డం హ‌రీష్‌రావుకు అన‌వాయితీ.. అయితే గ‌త తెలంగాణ స‌ర్కారు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా రెండోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత హ‌రీష్‌రావు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా స‌ర్కారులో క‌త్తెర పెట్టారు. వాస్త‌వానికి మేన‌మామ అయిన కేసీఆర్‌కు హ‌రీష్‌రావు న‌మ్మిన‌బంటు.. కానీ కేసీఆర్ కొడుకుకు పార్టీలో పెద్ద పీట వేసి హ‌రీష్‌రావు అటు పార్టీలో.. ఇటు ప్ర‌భుత్వంలో పెద్ద‌రికం లేకుండా చేశారు.

అయితే హ‌రీష్‌రావుకు బీజేపీ గాలం వేయ‌డంతో ఆ గాలానికి ఎక్క‌డ చిక్కుకుంటాడో అనే భ‌యంతో కేసీఆర్ మొన్న‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం క‌ల్పించారు. అంత‌కు ముందు జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో హ‌రీష్‌రావును కేవ‌లం మెద‌క్ పార్ల‌మెంట్‌కు మాత్రం ప‌రిమితం చేశారు. అయితే ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఉప‌ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన సీఎం కేసీఆర్  హ‌రీష్‌రావును రంగంలోకి దింపారు. ఇప్పుడు హ‌రీష్‌రావు రంగంలోకి దిగి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసే ప‌నిలో ప‌డ్డారు. సో హ‌రీష్ రావు రాక‌తో హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక ర‌స‌వ‌త్తరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version