తెలంగాణ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ కీలక నేత, సీఎం కేసీఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని లేదు. పచ్చని చెట్లని పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సంతోష్ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం భాగస్వాములు అయ్యారు. వారి చేత సంతోష్ మొక్కలు నాటించే కార్యక్రమాలు చేశారు.
ఇలా హరితహారం కార్యక్రమం చేస్తున్న సంతోష్‌పై తాజాగా కాంగ్రెస్ నేత జడ్సన్ ఢిల్లీకి వెళ్ళి మరీ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్)కు ఫిర్యాదు చేశారు. హరిత హారం కార్యక్రమంలో కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేగాకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా హరితహారం కార్యక్రమానికి దారి మళ్లించిందని, ఇక కాంపా నిధులను కూడా దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హరితహారం కార్యక్రమం ముసుగులో ప్రభుత్వ సొమ్మును సంతోష్ స్వాహా చేశారని, ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రదారి సంతోష్ అని ఆరోపించారు. అయితే కొన్ని ఆధారాలతో జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈడీ, సీబీఐ..సంస్థలు తెలంగాణలో బీఆర్ఎస్ నేతల టార్గెట్ గా పలు కేసుల్లో విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితని సైతం సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. అటు డ్రగ్స్ కేసు విషయంలో ఈడీ..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించింది. క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలని విచారించారు. ఇప్పుడు హరిత హారంలో కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేయాలని చెప్పి జడ్సన్..ఈడీకు ఫిర్యాదు చేశారు. మరి ఈ అంశంపై ఈడీ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాలి.