కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ వృత్తి పరంగా డాక్టర్. నేను ఢిల్లీలో ఆమరణ నిరహార దీక్ష చేపట్టినప్పుడు నా పక్కనే ఉండి నా ప్రాణాలను కాపాడిన వ్యక్తి. యువకుడు, వైద్యుడు.. ఆయన తలచుకుంటే రూ.కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను మీరందరూ ఆశీర్వదించాలి అని కోరారు సీఎం కేసీఆర్.
త్వరలోనే మిగిలిన రైతుల రుణమాఫీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధరణీ తీసేస్తే దళారుల రాజ్యం వస్తుంది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్. మరోవైపు ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. దేశంలో రైల్వే స్టేషన్లు, విమానశ్రయాలు చివరికీ కరెంట్ ను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు. కానీ చచ్చినా నేను పెట్టనని చెప్పాను. మీటర్లు పెట్టుడు లేదని తెగేసి చెప్పానని తెలిపారు సీఎం కేసీఆర్.
బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్‌లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు తప్పకుండా పెన్షన్ మంజూరు చేస్తాను.. ఇది నా వాగ్దానం, రందీ పడాల్సిన అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.