రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల యూపీలోని ఓ ఆస్పత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 10 మంది పసికందులు చనిపోయిన ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఆస్పత్రుల్లో తనిఖీల కోసం వెంటనే 10 బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవి తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేపట్టి నివేదిక అందించాలన్నారు. దీనికి తోడు ఫైర్ అలార్మ్స్, స్మోక్ట్ డిటెక్టర్స్ ఉన్నదీ, లేనిది పరిశీలించాలన్నారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో? లేవో చూడాలన్నారు. సేఫ్టీపై ఆస్పత్రి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు.