బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ విచారణ జరగనుంది. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టిందని, అందులో నిజం లేదని.. అందుకే తనమీద నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని మాజీ మంత్రి గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు.
హరీష్ రావు పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంతేగాక మాజీ మంత్రిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో సాక్షులు, ఫిర్యాదు దారుని వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఇప్పటికే కోర్టుకు అందజేశారు. మంత్రిగా ఉన్న టైంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. దీంతో శుక్రవారం(నేడు) హైకోర్టు బెంచ్ ముందుకు హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. కోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో వేచిచూడాలి.