మన దేశంలో ప్రజలు కరోనా తో మృతి చెందుతుంటే.. కెనడా దేశంలో మాత్రం తీవ్రమైన ఎండల కారణంగా మరణిస్తున్నారు. ఆ దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఎప్పుడు లేని విధంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో… డజన్ల కొద్దీ ప్రజలు మృతి చెందుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల తాకిడికి పిట్టల్లా రాలిపోతున్నారు. శుక్రవారం నుండి అంటే.. గత నాలుగు రోజులలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 49.1 ° C కు చేరుకోవడంతో కెనడాలో ఏకంగా 200 మందికి పైగా జనాలు మరణించారు.
ఈ మరణాలు ఎక్కువగా వాంకోవర్ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. మృతుల్లో ఎక్కువగా వృద్దులు ఉండటం విశేషం. అలాగే.. పశ్చిమ తీర ప్రావిన్స్ బ్రిటిష్ కొలంబియాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో కెనడా పర్యావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బ్రిటిష్ కొలంబియా, అల్బెర్టా మరియు సస్కట్చేవాన్, మానిటోబా, యుకాన్ మరియు వాయువ్య భూభాగాలకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వారం మొత్తం అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎవరు బయట తిరగకూడదని ఆదేశించింది.