విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో ఐదు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నాయి. సుమారు 150 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న రహదారులు కోతకు గురయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఇప్పటికే సముద్రం ఒడ్డున ఉన్న రెండు రచ్చబండలు, వలలు భద్రపరుచుకునే పాకలు సైతం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే.. ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగితా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.