హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వేలాది వాహనాలు ఒకేసారి రాలడంతో ఈ రద్దీ తలెత్తింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు సమాచారం. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పార్టీ స్థాపనకు 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సభను బీఆర్‌ఎస్ అధినాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. సభలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి, శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శనం ఇవ్వనున్నారు. కేసీఆర్ ప్రసంగంలో ఏముంటుందనే ఆసక్తి ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ కనిపిస్తోంది.