దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి జాతీయ రహదారులపై ఫాస్టాగ్ విధానం అమలులోకి వచ్చిన విషయం విదితమే. గతంలో డిసెంబర్ 1 అని నిర్దేశించినా.. ఆ గడువును కేంద్రం పొడిగించడంతో డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ విధానం అమలులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఫాస్టాగ్ తీసుకున్నవారు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వేగంగా వెళ్తున్నా.. ఫాస్టాగ్ ఇంకా తీసుకోని వారు మాత్రం టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి టోల్‌ప్లాజాలో ఉన్న లేన్లలో చాలా లేన్లను ఫాస్టాగ్ కోసం కేటాయించగా, ఆ మిగిలిన లేన్లలో పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుండడంతో.. టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
ఫాస్టాగ్ విధానం వల్ల ఆ ట్యాగ్‌లను కలిగి ఉన్నవారు టోల్‌ప్లాజాల గుండా వేగంగానే వెళ్తున్నప్పటికీ.. ఫాస్టాగ్‌లను పొందని వారికి మాత్రం టోల్‌ప్లాజాల వద్ద నరకం కనిపిస్తోంది. ఆదివారం జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ఎక్కడ చూసినా.. విపరీతమైన రద్దీ కనిపించింది. ఫాస్టాగ్ లేని వారు నగదు చెల్లింపుల కోసం టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జాంలు ఏర్పడ్డాయి. అయితే ముందు ముందు ఈ పరిస్థితి కొంత వరకు తగ్గే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ఫాస్టాగ్ లేని వారు మాత్రం టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగా టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌లు ఉన్న లేన్లలోంచి ట్యాగ్‌లు లేని వాహనాలు వెళితే రెట్టింపు టోల్ చార్జి వసూలు చేయాలని గతంలో కేంద్రం నిర్ణయించినా.. శనివారం ఆ నిర్ణయాన్ని ఒక నెల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇది వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే టోల్‌ప్లాజాల్లో ఉన్న లేన్లలో 25 శాతం లేన్లను హైబ్రిడ్ లేన్లుగా ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం ఆదేశించడం వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించేదే అయినా.. ఫాస్టాగ్ మాత్రమే ఉన్న లేన్లతో పోలిస్తే ఈ లేన్లలో వాహనాలు ముందుకు కదలడం గగనంగా మారింది. ఎందుకంటే హైబ్రిడ్ లేన్లలో అటు ఫాస్టాగ్‌తోపాటు ఇటు నగదు చెల్లింపులు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక నగదు చెల్లించే వారు పెద్ద ఎత్తున ఈ లేన్లలో బారులు తీరుతున్నారు. దీంతో ఫాస్టాగ్ ఉన్నవారు కేవలం ఆ ట్యాగ్ ఉన్న లేన్లలోంచే వెళ్తున్నారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లించే వాహనదారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే కేంద్రం ఈ విషయంపై పునరాలోచిస్తుందా, లేదా అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది..!