నెల్లూరు జిల్లాలో ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదంగా మారింది. అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి అనే ఓ ఎన్నారై కుటుంబ సమేతంగా లాక్ డౌన్ కు మునుపు తమ గ్రామానికి వచ్చారు. ఈ ఉదయం జనార్ధన్ రెడ్డి కూతురి వివాహం జరగనుంది. ఈ వివాహానికి హాజరు అయ్యేందుకు జనార్దన్ రెడ్డి బంధువు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ డాక్టర్ అయిన వి రామ కోటేశ్వర రావు ఫ్యామిలీతో కలిసి విమానంలో హైదరాబాద్ నుంచి కడపకి వచ్చారు.
అక్కడి నుండి బెంగళూరుకు చెందిన ఓ హెలికాప్టర్లో రేవూరుకు చేరుకున్నారు. హైస్కూల్ లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ వీరందరినీ దించేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయింది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇలా హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అవడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన హై స్కూల్ హెడ్మాస్టర్, హెలికాప్టర్ లో వచ్చిన ఏడుగురు పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.