ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారినపడి తెలంగాణ వెళ్లి చికిత్స చేయించుకోవాలి అని భావిస్తున్న బాధితులను తెలంగాణ పోలీసులు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ పోలీసులు రెండు రోజుల క్రితం సరిహద్దుల్లో ఆంక్షలు విధించడంతో ఈ వ్యవహారం పై హైకోర్టు జోక్యం చేసుకుంది. తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై గరిమెళ్ళ వెంకటకృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పోలీసులు సరిహద్దుల్లో రోగులను అడ్డుకోవడానికి వీల్లేదంటూ ఆదేశాలు ఇచ్చింది. అసలు అడ్డుకోవడానికి మీకు ఏ విధమైన అధికారాలు ఉన్నాయని కూడా తెలంగాణ పోలీసులను నిలదీసింది. అయితే తాజాగా మరోసారి తెలంగాణ పోలీసులు కోదాడ వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్న అంబులెన్సులను అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై మరోసారి వెంకటకృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ఆయన దాఖలు చేసి దీనికి సంబంధించి అత్యవసరంగా విచారణ జరిపి పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.