రోజు రోజూ పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లింది. అయితే.. వినియోగదారులకు అందుబాటులోకి ప్రముఖ బైక్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్‌ని అందివ్వగల ఈ స్కూటర్ ధరని రూ.99,000గా నిర్ణయించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్‌ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది కంపెనీ. Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్ చేస్తే 131 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎకో మోడ్‌లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్ (నార్మల్ మోడ్) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 95kmphగా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.