మీ సాన్నిహిత్యంపై నమ్మకం ఉంచాలి.. మీకు మీ భాగస్వామిపై నమ్మకముంటే ఎలాంటి గొడవలు ఉండవు. ఒకవేళ అనుకోకుండా గొడవ జరిగినా.. ఎవరో ఒకరు అలగడం బెటర్. అప్పుడు ఇద్దరి మధ్య ఉండే సాన్నిహిత్యం వారి అలకలను తీరుస్తుంది. అప్పటి వరకూ సాగిన గొడవ సరదాగా మారిపోతుంది. ముఖ్యంగా, ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకుంటే ఎలాంటి గొడవలు జరగవు.
కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి.. పాత కాలంలో మగవారు కుటుంబ బాధ్యతను తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తమకు అనుగుణమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. తమ భాగస్వామికి కూడా అండగా నిలుస్తున్నారు. అందుకే మీరు పెద్ద చదువులు చదివి గృహిణిగా సేవలందిస్తున్నా కూడా.. భర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తగిన తోడ్పాటును అందివ్వడానికి వెనుకాడవద్దు.
ఇద్దరికీ సమాన బాధ్యతే.. అన్ని విషయాల్లోనూ ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉండాల్సిందే. కొన్ని అనుకోని పరిస్థితులలో, మీకు లేదా మీ భాగస్వామికి ఆరోగ్యం బాలేకపోవచ్చు. అప్పుడు ఒకరి పై మరొకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అలాగే అప్పుడప్పుడు మీ పిల్లలతో లేదా పెద్దలతో కూడా ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఇద్దరూ కూర్చొని, మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు లేని సంసారాలు కొన్ని మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోండి. అందుకే ఒకరికొకరు తోడుగా, సపోర్ట్‌గా ఉండండి.
దాంపత్య బంధంలో కొన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తేనే బంధం హాయిగా సాగుతుంది. రెండు మనసులు ఒకటి కావాలంటే కొన్ని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.