హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోంమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. గేట్లను తోసుకుని లోపలికి వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో వందల మంది కార్యకర్తలతో చేపట్టిన తెలంగాణ హోంమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. తెలంగాణలో అత్యాచారాలు, హత్యలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇంటి వద్దకు చేరుకునే దాకా సైలెంట్ గానే ఉన్న వారు ఒక్కసారిగా గేట్లను తన్నుకుని లోపలికి చొరబడ్డారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పాల్గొన్నారు. ఇక ఖమ్మంలో మృగాళ్ల పాశవిక దాడిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఈ ఉదయం భట్టి విక్రమార్క కలిసి ఆరోగ్యం, ఇతర పరిస్థితులు గురించి ఆరా తీశారు. ఆస్తమా, కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అన్నారు.