హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 34, భాజపా 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ వ్యూహాలు మొదలుపెట్టింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రయత్నాలను అడ్డుకునేందుకు కొత్త ఎమ్మెల్యేలను తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఫలితాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం సాయంత్రానికి బస్సుల్లో రాజస్థాన్ తరలించేందుకు హస్తం పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
హిమాచల్ పరిస్థితులను ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి ఆమె శిమ్లా చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశపడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకూ ఖాతా తెరవకపోవడం గమనార్హం.