లక్ష్మీ కుబేరుల ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

-

దేశంలో దేవాలయాలకు కొదువలేదు. కానీ కుబేర ఆలయం మాత్రం అరుదు. అటువంటి కుబేర ఆలయ విశేషాలు తెలుసుకుందాం.. కుబేరుడు పేరు వినని వాళ్ళు వుండరంటే అతిశయోక్తి కాదు. అష్టైశ్వర్య ప్రదాత లక్ష్మీ దేవి అయితే దానిని మనదాకా అందించేవాడు కుబేరుడు యక్షులకు నాయకుడు. కుబేరుని పూజిస్తే సిరులు కలుగుతాయి. మరి ఆ కుబేరుణ్ణి లక్ష్మీదేవితో సహా పూజిస్తే తప్పక ధనప్రాప్తి, ఐశ్వర్యం లభిస్తాయని పండితుల అభిప్రాయం.అయితే దేశంలో లక్ష్మీ ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ కుబేరుడు, లక్ష్మీదేవి కలసి ఉన్న ఆలయాలు చాలా అరుదు. అయితే తమిళనాడులో కుబేరుడు, లక్ష్మీదేవిల ఆలయం ఉంది. ఆ విశేషాలు తెలుసుకుందాం…

 


కుబేరుడు విగ్రహాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి. కానీ ప్రత్యేక ఆలయం పెద్దగా తెలిసనవి అయితే లేవు. కుబేరుడు భార్య చిత్రలేఖతోనూ, ఐశ్వర్య స్వరూపమైన శ్రీమహలక్ష్మితోనూ కొలువుతీరిన ఆలయం తమిళనాడులో ఉంది.

కుబేరుడి కథ

కుబేరుడు విశ్వావసు. పేరు వైశ్రవణుడు. ఆయన పెద్దయ్యాక తండ్రి సలహామీద బ్రహ్మగురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతనికి కుబేరుడని పేరుపెట్టి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. అతనికి పుష్పక విమానాన్ని కూడా ఇచ్చాడు. తండ్రి సలహా ప్రకారం తన లంకా రాజ్యాన్ని రావణుడికి అప్పజెప్పి శివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి ప్రసన్నుడైన శివుడు పార్వతితోసహా ప్రత్యక్షమవుతాడు. పార్వతి అద్భుత సౌందర్యానికి, తేజస్సుకి తట్టుకోలేని కుబేరుడి ఒక కనురెప్ప అప్రయత్నంగా కొట్టుకుంటుంది. ఆగ్రహించిన పార్వతి అతని కంటి చూపుని పోగొడుతుంది. శివుడు పార్వతి అపోహని తొలగించి కుబేరుడి కంటి చూపు తిరిగి ప్రసాదిస్తాడు. పార్వతి కుబేరుడికి ఇంకేమైనా బహుమతి ఇవ్వమంటే శివుడు నవ నిధులు ఇస్తాడు. అవే కల్పవృక్షం, కామధేనువు, శంఖం, చేప, తాబేలు, వజ్ర వైఢూర్యాలు, పాలు, తామర మరియు ఆవు, దూడ.

పురాణ కధ

బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణాల ప్రకారం పులస్త్యుడి కొడుకైన విశ్వావసు, ఇళల కుమారుడు వైశ్రవణుడు, ఆయనే కుబేరుడు. విశ్వావసు, కైకసిల కుమారుడు రావణుడు. కుబేరుడు లోకంలో వున్న ధనానికంతా అధిపతి. లక్ష్మీదేవి సాక్షాత్ ఐశ్వర్య స్వరూపం. కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీ నారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్టించి లక్ష్మీ నారాయణ వ్రతం చేస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ. లక్ష్మీదేవి ప్రత్యక్షమయి ఆయనని ధనాధిపతిని చేసింది. ప్రజలకు వారివారి యోగ్యత ప్రకారం సంపదను ప్రసాదించే బాధ్యత అప్పజెప్పింది. అంతేకాదు, కలియుగంలో తమ ప్రతిమలతోబాటు కుబేరుడి ప్రతిమకూడా పెట్టి పూజించి తర్వాత ఆ ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేసినవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వరం కూడా ఇచ్చింది. ఏ కధ ఎలా వున్నా కుబేరుడు ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించినవారికి వారి అనుగ్రహం వుంటుంది.

ఆలయ విశేషాలు

ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమప్రక్క గుండ్రంగా ప్రతిష్టించబడిన షోడశ (16) గణపతులను చూడవచ్చు. పక్కనే నవ గ్రహాలు భార్యలతో సహా కొలువు తీరారు. ప్రదక్షిణ మార్గంలో వెళ్తుంటే గర్భ గుడి బయట గోడలమీద ఒక ప్రక్క బ్రహ్మ, సరస్వతులు, వెనుక స్వర్ణాకర్షణ భైరవుడు (నాకర్ధం అయినంతమటుకూ ఈయన క్షేత్ర పాలకుడు), ఇంకో ప్రక్క వేంకటేశ్వరస్వామి విగ్రహాలున్నాయి. ప్రక్కనే లాఫింగ్ బుధ్ధా, కుమార స్వామి వగైరా విగ్రహాలున్నాయి. గర్భాలయంలో కుబేరుడు, చిత్రలేఖల విగ్రహాలు, వాటి వెనుక లక్ష్మీదేవి విగ్రహం వున్నాయి. కుబేరుడికి వెండి తలపాగా. విగ్రహాలన్నింటికీ వెండి తొడుగులు. కరెన్సీ నోట్ల హారాలు. మరి లక్ష్మీ కుబేరుల ఆలయం కదండీ. ఆలయం లోపలే విక్రయశాలలు. వాటిలో ఒక దానిలో పూర్వం వచ్చే చిల్లి కాణీ ఆకారంలో వున్న ఒక నాణేనికి ఎఱ్ఱ దారం కట్టి 30 రూ. లకి అమ్ముతున్నారు. అది తీసుకుని లాఫింగ్ బుధ్ధా ఎడమ చేతిలో పెట్టి, తర్వాత ఆయన బొజ్జమీద తాకించి పర్సులో పెట్టుకుంటే అదృష్టం వారిదేనట. ఇంకో విశేషమేమిటంటే కుబేరుడికి ఆకుపచ్చ రంగంటే ప్రీతి. అందుకే, అక్కడ రక్షగా అమ్మే దారాలే కాదు కుంకుమ కూడా ఆకుపచ్చ రంగే.
ఈ దేవాలయలో దర్శన సమయాలు ఉదయం 6-30 నుంచి 12 గంటలదాకా, తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం. ల దాకా.

రవాణా మార్గము

ఎగ్మూరు రైల్వే స్టేషన్ నుంచి చెంగల్పట్ వెళ్ళే లోకల్ లో వెళ్ళి వందలూరు స్టేషన్ లో దిగాలి. దాదాపు గంట ప్రయాణం. టికెట్ 10 రూ.లు. అక్కడ నుంచి ఆటోలలో వెళ్ళవచ్చు. చెన్నై నుంచి బస్సులు కూడా వున్నాయి. ఆలయం రత్న మంగళం అనే ఊరిలో వున్నది. వందలూరు జూ పక్కనే వున్న రోడ్డులోంచి దాదాపు 7 కి.మీ. ల దూరం వెళ్ళాలి. (కేలంబాకం – మహాబలిపురం రోడ్డు). ఎడమచేతివైపు టాగూర్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. దాని తర్వాత ఎడమవైపు తిరిగి, అర కిలో మీటరు దూరం వెళ్ళిన తర్వాత కుడి వైపు తిరగాలి. ఎవరిని అడిగినా చెప్తారు. వందలూరు స్టేషన్ నుంచి 12 కి.మీ. ల దూరం. తాంబరంనుంచి బస్సులుకూడా వున్నాయి. తిరుపోరూరు వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version