వైసీపీ తరఫున గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ దక్కించుకుని.. వ్యూహాత్మకంగా ముందుకు సాగి న యువ నేతల్లో కీలకమైన నాయకుడు రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించిన మార్గాని భరత్. జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ముద్ర వేసుకున్న ఈయన.. గెలుపు చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే .. అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాజమండ్రి ప్రజలు ఎన్నికల్లో అంతే చైతన్యంతో వ్యవహరిస్తారు. త మకు అన్ని విధాలా అండగా ఉండే నాయకుడికి మాత్రమే ఇక్కడి ప్రజలు పట్టం కట్టడం గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో మనకు కనిపించింది.
అదే సమయంలో అవినీతి రహితంగా నాయకులు వ్యవహరిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా ఇక్కడి ప్రజలు అన్ని కోణాల్లోనూ పరిశీలించి గెలుపు గుర్రం ఎక్కిస్తారు. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున ఎన్నికల్లో తొలిసారి అరంగేట్రం చేసిన మార్గాని భరత్‌ను విజయతీరాలవైపు నడిపించారు. నిజానికి యువకుడు అనేకానీ, మంచి ఆలోచనాపరుడిగా.. పేదల సమస్యలు తెలిసిన యువ నాయకుడిగా ఆయనకు జగన్ దగ్గర మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఈ టికెట్‌కోసం ప్రయత్నించినా.. జగన్ ఏరికోరి మార్గానికి అవకాశం కల్పించారు. ఆయనను ప్రజలు కూడా నెత్తిన పెట్టుకున్నారు.
ప్రజల ఆశల మేరకు మార్గాని కూడా పనులు చేయడంలో ముందుంటున్నారు. ఎక్కడికక్కడ సమస్యలను అధ్యయనం చేయడమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటున్న నాయకుడిగా ఆయన అ తి తక్కువ సమయంలోనే ఆయన పేరు సంపాయించుకున్నారు. పార్టీలోనూ నాయకులను, ఎమ్మెల్యేల ను, మంత్రులను కలుపుకొని పోతూ.. కలుపుగోలుగా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. పార్టీ తరఫున , రాష్ట్రం తరఫున, నియోజకవర్గం తరఫున ఆయన అనేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు ఆయన ఏడాది ఎంపీగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇక మీడియాలోనూ వైసీపీ తరపున ఆయన బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే, అదే సమయంలో నిండు చంద్రుడికి కూడా మచ్చలున్నాయన్నట్టుగా ఎంపీగా మార్గానిపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆవ భూముల విషయంలో ఆయన జోక్యం ఉందని, సొంత పార్టీలోనే కొన్ని సెటిల్మెంట్ల విషయంలో ఆయన జోక్యం చేసుకుని కొందరు నాయకులతో ఢీ అంటే ఢీ అన్నారని, దీనిపై జగన్ కూడా సీరియస్ అయ్యారని సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలోనూ ప్రచారం జరిగింది. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా.. రాజకీయాల్లో ఉన్న నేతలకు ప్రశంసలే కాదు.. ఆరోపణలు కూడా ఉంటాయనే విషయాన్ని మార్గాని గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.
నిజానికి ఎంత నిజాయితీగా ఉన్న బెడ్డలు వేసే రాజకీయాలు నేడు సహజంగానే దాపురించాయి. సో.. వీటిని తన లౌక్యంతో ఛేదిస్తూనే.. అందరికీ అందుబాటులో ఉంటూ.. అందరినీ కలుపుకొని పోతూ.. ముందుకు సాగితే.. మంచి ఫ్యూచర్ ఆయనకు సొంతం అవుతుందని, రాజమండ్రి ఎంపీ నియోజకవర్గంలో ఉండవల్లి తర్వాత .. ఎదిగే.. మంచి అవకాశం ఆయనకు అందుతుందని అంటున్నారు రాజమండ్రి ప్రాంత పరిశీలకులు. మరి మార్గాని ఆవేశాన్ని వీడి.. ఆలోచన బాట పడితే.. గోల్డెన్ ఫ్యూచర్ ఖాయం!!